సూరత్ : పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాను ఏ తప్పూ చేయలేదని విచారణ సందర్భంగా కోర్టుకు రాహుల్ తెలిపారు. న్యాయ స్థానానికి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా శాశ్వత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ అభ్యర్థనపై నిర్ణయాన్ని డిసెంబర్ 10న తెలియజేస్తామన్న కోర్టు, ఆ రోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్కు మినహాయింపు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ భాజపా ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా దాఖలు చేశారు.