బెంగుళూరు: రాజీనామా చేసే ప్రసక్తే లేదని కర్నాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. భూ కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ గెహ్లాట్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మైసూరు లేఅవుట్లో జరిగిన అవకతవకలపై సిద్దరామయ్యపై ఆరోపణలు వచ్చాయి. తాను ఏమీ తప్పు చేయలేదని, అందుకే రాజీనామా చేయడం లేదని సిద్దరామయ్య తెలిపారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగం, చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు. కోర్టులో తనను విచారిస్తారని, ఆ సమస్యను న్యాయంగానే పోరాడనున్నట్లు సీఎం చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నట్లు సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.బీజేపీ ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తోందని, ఢిల్లీ.. జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇలాగే జరిగిందన్నారు. కర్నాటకలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, జేడీఎస్ ఈ కుట్రలో భాగస్వామ్యం అయినట్లు తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనతో ఉన్నదని, క్యాబినెట్తో పాటు సర్కారు తనతోనే ఉన్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా తన వైపే ఉన్నట్లు చెప్పారు. రాజ్భవన్ను ఓ రాజకీయ పావుగా వాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో గవర్నర్ ఓ తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు.