Home » అజిత్‌ పవార్‌పై సుప్రియా ఫైర్‌

అజిత్‌ పవార్‌పై సుప్రియా ఫైర్‌

0 comment
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తన సోదరుడు వరుసైన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను విమర్శించారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రియమైన సోదరీమణులను గుర్తుంచుకోలేదని అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారి ప్రేమ పొంగి పొర్లుతోందని మండి పడ్డారు. లోక్సభ ఎన్నికల్లో భార్య సునేత్ర పవార్ను సోదరి (సుప్రియా సూలే) పై పోటీకి దించడం పొరపాటని, దీనికి తాను చింతిస్తున్నట్లు ఇటీవల పేర్కొన్న అజిత్ పవార్కు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. అలాగే వ్యక్తిగత సంబంధాలు, వ్యాపారాన్ని ఆయన మిళితం చేశారని ఆరోపించారు. ‘సంబంధాలు, వ్యాపారం మధ్య తేడాను మన సోదరులు గుర్తించ లేరు. ఎవరూ కూడా డబ్బును సంబంధాల్లోకి తీసుకురాకూడదు. అలాగే వ్యాపారంలోకి సంబంధాన్ని తీసుకురాకూడదు. అయితే మా సోదరుడు దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇది మాకు చాలా బాధ కలిగించింది’ అని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘లడకీ బహీన్’ స్కీమ్ను సుప్రియా సూలే విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి వల్లనే మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది. వారు నిజమైన ఉద్దేశంతో ఏమీ చేయరు. రెండేళ్ల క్రితం అక్కాచెల్లెళ్లపై ఎవరికీ ఆప్యాయత, ఆదరణ కనిపించలేదు. ఇది లోక్సభ ఎన్నికల ప్రభావం మాత్రమే’ అని అన్నారు.

Leave a Comment