చెన్నై : మహిళా డాక్టర్ల పట్ల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. హౌజ్ సర్జన్ పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో 150 మంది హౌజ్ సర్జన్లు ఆందోళనకు దిగారు. మహిళా డాక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని నిన్న సాయంత్రం నుంచి హౌజ్ సర్జన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్గా స్పందించారు. డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. మహిళా డాక్టర్ల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని డీన్ ఆఫీసు ముందు డాక్టర్లు ఆందోళనకు దిగారు.కోయంబత్తూరు మెడికల్ కాలేజీలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, సెంటినరీ బిల్డింగ్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత డాక్టర్ తన స్కూటీని తీసుకెళ్లేందుకు పార్కింగ్కు వెళ్లగా, అక్కడున్న వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని తోసేసి ఆమె అక్కడ్నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు డీన్ డాక్టర్ నిర్మల మీడియాకు తెలిపారు