Home » కదంతొక్కిన సహారా ఇండియా బాధితులు, ఏజెంట్లు

కదంతొక్కిన సహారా ఇండియా బాధితులు, ఏజెంట్లు

0 comment
విజయ నగరం : 50 కోట్ల మంది దేశ ప్రజలకు ముడిపడి ఉన్న సహారా ఇండియా డబ్బులు ఖాతాదారులకు చెల్లించకుంటే కేంద్రంలో ఉన్న మోడీ, అమిత్ షాలు ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదని సహారా ఇండియా బాధితుల పోరాట కమిటీ గౌరవ సలహాదారు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. బుధవారం సహారా ఇండియా బాధితుల పోరాట కమిటీ (సిఐటియు) ఆధ్వర్యంలో ఎస్ కోట పట్టణంలో ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి దేవి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ 13 ఏళ్లుగా ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా సహారా ఇండియా యాజమాన్యం ఖాతా దారులు డబ్బులు కొట్టేయాలని చూస్తుందన్నారు. 13 కోట్ల మంది ఖాతాదారుల డబ్బులు ఇవ్వకుండా రెన్యువల్ పేరుతో 13 ఏళ్లుగా డబ్బులు ఇవ్వకుండా యాజమాన్యం మోసం చేస్తుంటే కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం యాజమాన్యానికి కొమ్ము కాస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో రెండు లక్షలు మంది ఖాతాదారులు ఉన్నారన్నారు. పిల్లలు పెళ్ళిళ్ళు కోసం, ఇతర అవసరాల కోసం పేదలు, వెనుకబడిన కులాలు వారు డబ్బులు దాచుకున్నారని అన్నారు. మరోవైపు పార్లమెంట్ సాక్షిగా డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయని, ఖాతాదారులు ముందుకు రావడం లేదని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారాం వ్యాఖ్యలు హాస్యా స్పదంగా ఉన్నాయని అన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఖాతాదారులను మోసం చేసే కేంద్ర మంత్రి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50 కోట్ల మందికి సంబంధించిన విషయంలో యాజమాన్యానికి కొమ్ము కాసి ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటే ప్రజలు ఆగ్రహానికి మోడీ, అమిత్ షా లు గురికాక తప్పదని హెచ్చరించారు. ఉద్యమం కొన్ని నెలలుగా జరుగుతుందని, ప్రభుత్వం స్పందించి ఖాతాదారులు డబ్బులు చెల్లించకపోతే ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్త ఉద్యమంగా మార్చి పేదలకు న్యాయం జరిగే వరకు సిఐటియు ఖాతాదారులకు అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు బిజెపి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారని వెంటనే కేంద్రంతో మాట్లాడి ఖాతాదారుల డబ్బులు ఇప్పించే విధంగా చొరవ చూపాలన్నారు. కేంద్రం సహారా ఇండియా బాదితులు, ఏజెంట్లు సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ఖాన్, ప్రకాష్, సిమ్మ అప్పారావు, నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు ఎం.రమణ, అప్పారావు, వందల సంఖ్యలో సహారా ఇండియా బాదితులు ఏజెంట్లు పాల్గొన్నారు.

Leave a Comment