Cap On Airfares in India: ఇండిగో సంక్షోభం కారణంగా విమాన టిక్కెట్ల ధరలు పెరగడంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పొడవునా విమాన ఛార్జీలను నియంత్రించలేమని తేల్చిచెప్పారు. దేశంలోని విమాన ఛార్జీల నియంత్రించాలంటూ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఆయన మాట్లాడారు. ఇటీవలి ఇండిగో సంక్షోభంలో కనిపించినట్లుగా, అసాధారణ పరిస్థితులలో విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, అయితే, పండుగ సీజన్లో టిక్కెట్ల ధరలు సాధారణంగా పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వం ఏడాది పొడవునా విమాన ఛార్జీలను పరిమితం చేయలేమని అన్నారు.
టిక్కెట్ ధరల డీరెగ్యులేషన్ గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందాలని అనుకుంటే ఎక్కువ మంది ప్లేయర్లు మార్కెట్లోకి ప్రవేశించాలంటే టిక్కెట్ డీరెగ్యులేషన్ చేయాలని అన్నారు. అయితే టిక్కెట్ డీరెగ్యులేషన్ నుంచి దూరంగా ఉండటం వలన విమానయాన సంస్థలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదని, అవసరమైనప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని అలయన్స్ ఎయిర్ మూడు నెలల స్థిర విమాన ఛార్జీల పైలట్ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇది ప్రయాణీకులకు ఎంత ప్రయోజనం చేకూర్చిందో అంచనా వేసి, ప్రైవేట్ విమానయాన సంస్థలు కూడా సదరు ప్రణాలికను పరిగణించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

