MLC Dasoju Sravan Kumar on Sai Eswara chary suicide: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో.. బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మాహుతి చేసిన విశ్వకర్మ యువకుడు సాయి ఈశ్వర చారి సంతాప సభలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని అన్నారు. బీసీలను మోసగించిన ముఖ్యమంత్రికి బీసీ సమాజం తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి మహనీయులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మోసానికి వ్యతిరేకంగా శ్రీకాంతా చారి ఆత్మాహుతి చేసుకున్నారని ప్రస్తావించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేయడంతో విశ్వకర్మ బిడ్డ సాయి ఈశ్వరాచారి ప్రాణత్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని.. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హామీ ఇచ్చారు.

