Telangana Road Accidents: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్ద శంకరం పేట వద్ద 161 జాతీయ రహదారి పై ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ (మం) మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు. మృతుల్లో భార్యాభర్త, కొడుకు, కూతురు ఉన్నారు. ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ లింగంపల్లి నుంచి స్వగ్రామానికి ఓటు వేయడానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జనగామ జిల్లాలో ఇద్దరు మృతి
స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై బైకును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బైకుపై వస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామస్తులుగా గుర్తించారు. వీరు రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్నట్లు సమాచారం. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

