Tandur Crime News: వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని ఎన్నో ఆశలతో పెళ్లాడిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడయ్యాడు. పెళ్లయిన ఎనిమిది నెలలకే అనంతలోకాలకు చేరుకుంది. భర్త, అత్తమామలు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కఠన్‌కోట్‌కు చెందిన అనూష(22), తాండూరుకు చెందిన పరమేశ్ ఎనిమిది నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం పరమేశ్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. కాగా గురువారం ఉదయం పుట్టింటిలో ఉన్న అనూషను పరమేశ్ బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చాక భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలో భర్త పరమేశ్, అతని తల్లిదండ్రలు అనూషపై దాడి చేశారు. దీంతో అనూష అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పరమేశ్, అనూషను స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాడు. కాగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. భయాందోళనకు గురైన పరమేశ్ హాస్పిటల్ నుండి పారిపోయాడు.
విషయం తెలుసుకున్న అనూష తల్లిదండ్రలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే ఆమె మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పరమేశ్, అతని తల్లిదండ్రులపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అదనపు కట్నం కోసం తన కూతురిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరమేశ్, అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

