Sonia Gandhi slams VB-G RAM G Bill: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) శనివారం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సోనియా గాంధీ ఒక వీడియో ప్రకటన చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా MGNREGA పథకాన్ని నీరుగార్చిందని ఫైర్ అయ్యారు.
ఈ చర్య కేవలం మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో ఆగలేదని, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని, నిర్మాణాన్ని ఏకపక్షంగా మార్చివేసిందని ఆమె ఆరోపించారు. ఎటువంటి చర్చ లేకుండా, ఎవ్వరినీ సంప్రదించకుండా, ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఈ మార్పులను బలవంతంగా రుద్దుతోందని సోనియా గాంధీ విమర్శించారు. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ పథకాన్ని రద్దు చేయడానికి ఉద్దేశించిన ఈ “నల్ల చట్టాన్ని” దేశవ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
MGNREGA స్థానంలో వచ్చిన VB-G RAM G బిల్లుపై ఒక వీడియో ప్రకటనలో సోనియా గాంధీ, “20 సంవత్సరాల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, MGNREGA చట్టం పార్లమెంట్‌లో ఏకాభిప్రాయంతో ఆమోదించారు. ఇది పేదలకు ఉపాధిపై చట్టపరమైన హక్కును కల్పించింది. ఈ పథకం గ్రామ పంచాయతీలను బలోపేతం చేసింది. MGNREGA ద్వారా మహాత్మా గాంధీ కలల దిశగా ఒక పటిష్టమైన అడుగు పడింది.” అని పేర్కొన్నారు.

