Bhadrachalam: వేదమంత్రాల నడుమ శంఖనాదం మధ్య పవిత్ర గోదావరి నదికి ఘనంగా హారతి ఇచ్చారు భద్రాచలం రామాలయం అర్చకులు. శ్రీరామచంద్రమూర్తి దివ్య సన్నిధానంలో ప్రవహిస్తున్న గోదావరి నది అపారమైన మహిమ కలిగినదని, ఈ నదిలో నిత్యం ఒక కోటి తీర్ధాలు కలిసి ప్రవహిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయని అర్చకులు తెలిపారు. వేదకాలం నుంచే గోదావరి నదిని తల్లి సమానంగా భావిస్తూ, వేదాల్లో నదికి సంబంధించిన అనేక సూక్తులు, ప్రార్థనలు ఉన్నాయని వారు తెలిపారు. ‘సూక్తి’ అంటే మంచి మాటలు, కష్టాలు కలగనీయకుండా కాపాడమని తల్లిని ప్రార్థించే భావం అందులో ప్రతిఫలిస్తుందని వివరించారు.
రామాయణ కాలంలో అరణ్యవాసానికి వచ్చిన సందర్భంలో సీతాదేవి కూడా గోదావరి నదిని దేవతగా భావించి, నదిలో లభించే వనరులు మానవ జీవనానికి ఆధారమని పేర్కొన్న సందర్భాలు ఉన్నాయని అర్చకులు గుర్తు చేశారు. మన జీవనానికి తోడ్పడే ప్రకృతి అంశాలను భగవంతుడిగా భావించి ఆరాధించడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతగా వారు వివరించారు.
ఈ పరంపరలో భాగంగా వేదమంత్రాల ఉచ్ఛారణతో కార్యక్రమాన్ని ప్రారంభించి, శంఖనాదం మధ్య పుష్పాలు సమర్పిస్తూ గోదావరి నదికి ఘనంగా హారతి నిర్వహించారు. గోదావరి హారతి సందర్భంగా అర్చకులు నది హారతి ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.
ఈ సందర్భంగా “ రామ లక్ష్మణ జానకి జై – బోలో హనుమాన్ కి జై” అనే జయజయధ్వానాలతో గోదావరి పరివాహక ప్రాంతమంతా మారుమోగి, నది తీర ప్రాంతాలు భక్తి భావంతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోదావరి తల్లికి భక్తిశ్రద్ధలతో హారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , దేవస్థానం ఈఓ దామోదర్ రావు, అధికారులు, భక్తులు పాల్గొని గోదావరి నది హారతి కార్యక్రమాన్ని తిలకించారు.

