Adilabad: జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఉన్నత విద్య పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే దశాబ్దాల కల రాజకీయ జోక్యం, నేతల అవగాహన లేమితో నీరుగారిపోయింది. శ్యామ్ పిట్రోడా నేతృత్వంలోని జాతీయ విజ్ఞాన కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రతి జిల్లాకు ఒక వర్సిటీ ఉండాలి. ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధమైనా, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ విద్యార్థులకు ఆ అవకాశం దక్కలేదు.
చేజారిన ‘రూసా’ నిధులు
2009లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మల్ పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా మార్చేందుకు అడుగులు పడ్డాయి. 2013లో రూసా పథకం కింద 55 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ నేతల మధ్య తలెత్తిన విభేదాలు శాపంగా మారాయి. నిర్మల్ నుండి ఆదిలాబాద్‌కు వర్సిటీని మార్చాలనే ప్రతిపాదనను కేంద్రం అంగీకరించకపోవడంతో కోట్లాది రూపాయల నిధులు వెనక్కి మళ్లిపోయాయి. అలాగే ఉట్నూరులో ఏర్పాటు కావాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం కూడా రాజకీయ పైరవీల వల్ల వరంగల్ జిల్లాకు తరలిపోయింది.
ప్రభుత్వ వర్సిటీల నిర్వీర్యం.. ప్రైవేటుకు పెద్దపీట
గత పదేళ్లలో ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన పాలకులు, దానికి భిన్నంగా ప్రైవేటు యూనివర్సిటీలకు గేట్లు తెరిచారు. ఉన్న విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా నియామకాలు లేవు. సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉండటం, నిధుల కొరతతో ప్రభుత్వ సంస్థలు కునారిల్లుతున్నాయి. సామాన్య విద్యార్థులకు ఉన్నత విద్య భారంగా మారుతోంది. ఇది ఇలాగే కొనసాగితే పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
‘పరిధి’ మారుతోంది.. విద్యార్థుల గోడు పట్టడం లేదు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా మారింది. మొదట ఉస్మానియా, ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోకి జిల్లాను మార్చారు. దూరాభారం తగ్గించుకునేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం (నిజామాబాద్) పరిధిలోకి చేర్చాలని విద్యార్థులు కోరుతున్నా, రాజకీయ ఒత్తిళ్లతో మళ్లీ కాకతీయ పరిధిలోకే నెట్టారు. జిల్లాను కేవలం ఆదాయ వనరుగా చూస్తున్నారే తప్ప, ఇక్కడి విద్యార్థుల ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానికంగా మేధావులు ఉన్నా, ప్రాంతీయ భేదాల వల్ల విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగావకాశాలు దక్కక జిల్లా వాసులు నష్టపోతున్నారు.

