Nimesulide Painkiller Ban: ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమిసులైడ్ (Nimesulide) వాడకంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆంక్షలు విధించింది. 100mg కంటే ఎక్కువ మోతాదు కలిగిన అన్ని రకాల నిమిసులైడ్ ఓరల్ ఫార్ములేషన్ల (మాత్రలు, సిరప్‌లు) తయారీ, విక్రయం, పంపిణీని తక్షణమే నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మోతాదులో ఔషధాన్ని వాడటం వల్ల మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
ఆరోగ్య రిస్క్ కారణం
డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 100mg కంటే ఎక్కువ ఉన్న ఇమ్మీడియట్ రిలీజ్ డోసేజ్ ఫార్మ్‌లు ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26ఏ కింద ఈ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఔషధానికి బదులుగా సురక్షితమైన ఇతర ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
పశువుల మందుపై గతంలోనే నిషేధం
ఇదే ఏడాది జనవరిలో పశువుల కోసం వాడే నిమిసులైడ్ ఫార్ములేషన్లను కూడా కేంద్రం నిషేధించింది. ఈ మందు తిన్న పశువుల కళేబరాలను ఆహారంగా తీసుకోవడం వల్ల రాబందులు మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన పరిశోధనల ఆధారంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు.
షెడ్యూల్ K మార్పులు
తాజా నోటిఫికేషన్ ద్వారా డ్రగ్స్ రూల్స్ 1945లో కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించారు. షెడ్యూల్ K లోని నిర్దిష్ట విభాగం నుండి ‘సిరప్’ అనే పదాన్ని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అభ్యంతరాలు లేదా సూచనలు తెలపడానికి ప్రజలకు 30 రోజుల సమయం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధిక మోతాదు నిమిసులైడ్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

