Khaleda Zia: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాన మంత్రి, బీఎన్‌పీ (BNP) అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం (జాతీయ సంగ్రామ్ భవన్) దక్షిణ ప్లాజాలో జరిగిన నమాజ్-ఎ-జనాజా (ప్రార్థనలు) వేదికగా వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం రాజధానిలోని చంద్రమ ఉద్యానవనంలో తన భర్త, దివంగత మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ సమాధి పక్కనే ఆమె భౌతిక కాయాన్ని ఖననం చేశారు.
హాజరైన విదేశీ ప్రతినిధులు
ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. బుధవారం ఉదయం ఢాకా చేరుకున్న ఆయన, బీఎన్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్‌ను కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సంతాప సందేశాన్ని అందించారు. భారత ప్రభుత్వం తరపున తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జైశంకర్ తో పాటు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయ్యాజ్ సాదిక్, నేపాల్, భూటాన్ దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ కూడా పార్లమెంట్ భవనానికి చేరుకుని నివాళులర్పించారు.
రాష్ట్రవ్యాప్త సెలవు.. మూడు రోజుల సంతాపం
ఖలీదా జియా మరణం నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం బహిరంగ సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢాకా వీధుల్లో 10 వేల మందికి పైగా పోలీసులను, ఆర్మీ బలగాలను మోహరించారు. 80 ఏళ్ల ఖలీదా జియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మూడు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన ఆమె నిష్క్రమణతో ఒక శకం ముగిసిందని ఆ దేశ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

