Delhi Fog Effect: శుక్రవారం ఢిల్లీలో విమాన కార్యకలాపాలు మరోసారి ప్రభావితమయ్యాయి, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో దట్టమైన పొగమంచు(Delhi Fog Effect) కమ్ముకోవడంతో దృశ్యమానతపై తీవ్ర ప్రభావం పడింది. దట్టమైన పొగమంచు కారణంగా అనేక విమానాల రాకపోకలు ఆలస్యం, అంతరాయాలు ఏర్పడ్డాయని, రియల్ టైమ్ అప్‌డేట్‌ల కోసం ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆగ్రా, అలీగఢ్, బాఘ్‌పత్, బరేలీ, బిజ్నోర్, బులంద్‌షహర్, ఎటా, ఇటావా, ఫిరోజాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ వంటి ఉత్తరప్రదేశ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్‌కు, అలాగే పంజాబ్‌లోని అమృత్‌సర్, ఫతేగఢ్ సాహిబ్, గురుదాస్‌పూర్, పాటియాలా, సంగ్రూర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తక్కువ దృశ్యమానత కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

