Home » IND VS SA: పాండ్యా వీరవిహారం.. టీ20 సిరీస్ భారత్ సొంతం..

IND VS SA: పాండ్యా వీరవిహారం.. టీ20 సిరీస్ భారత్ సొంతం..

by Post Editor
0 comments

India vs South Africa T20I Series IND vs SA: అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదవ టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-1తో సొంతం చేసుకుంది. టీమిండియా బ్యాటర్ హార్థిక్ పాండ్యా 25 బంతుల్లో 63 పరుగులు చేయడంతో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యంతో ఛేదనలో విఫలమైన సౌతాఫ్రికా 201 పరుగులు చేసింది.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ(34), సంజూ శాంసన్ (37) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 63 పరుగుల వద్ద బోస్చ్ అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ 73 పరుగులు చేయగా.. హార్థిక్ పాండ్యా(63) వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (5) ఈ మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు.

232 పరుగుల భారీ లక్ష్యం ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభంలో దూకుడుగా ఆడింది. డీకాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో బ్రెవిస్(31) మాత్రమే రాణించాడు. దీంతో 30 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.

టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4, బుమ్రా 2, అర్షదీప్, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. ఇటు బ్యాట్‌తో అటు బంతితో రాణించిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ విజయంతో టీమిండియా వరుసగా 8 టీ20 సిరీస్‌లను గెలుచుకుని రికార్డు సృష్టించింది.

You may also like