Kothagudem: జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసి, దేశ స్వాతంత్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని టీపీసీసీ సభ్యులు, ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేబీ శౌరి ముందుగా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికి కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత దేశ ప్రజలకు అండగా 140 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, గాంధీ నేతృత్వంలో స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.
పది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలో కులాలు, మతాల ప్రాతిపదికన పాలన సాగిస్తుందన్నారు. పేద ప్రజల ఉపాధి కోసం ప్రారంభించిన పథకాలకు మహాత్మా గాంధీ పేరును బిజెపి ప్రభుత్వం తొలగిస్తుందని పేరు తొలగించినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీ ని దూరం చేయలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. నాలుగు కోట్ల ప్రజల కోరిక మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు.
దేశంలో గరీబీ హటావో, బ్యాంకుల జాతీయకరణ, ఉపాధి హామీ పథకం వంటి అనేక పథకాలు అమలు చేసిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ నేత రాహుల్ గాంధీ సూచనలు, సలహాలతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా ఉండి పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ చైర్మన్ అల్లాడి నరసింహారావు, NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి కరీం, కొత్తగూడెం పట్టణ మైనార్టీ అధ్యక్షుడు కాజా బాక్స్, మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నిసార్, బిక్షపతి, కరీం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీరెల్లి భద్రం, NSUI నాయకులు శ్రీధర్, జీవన్, సందీప్, తదితరులు పాల్గొన్నారు…

