న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వెబ్‌సైట్ పాకిస్తానీలు హ్యాక్ చేసి ఆ తర్వాత కాసేపటికి పునరుద్ధరించినట్టు తెలిసింది. ‘‘తీవ్రవాదులు మనసులను హ్యాక్ చేశారు. అలాంటి వాళ్లున్న దేశం మాత్రమే ఈ పనులు చేస్తుంది. ఇప్పుడు వాళ్ల వ్యవహారం మొత్తం బయటపడుతోంది. ఇలాంటి దుశ్చర్యల వల్లే పాకిస్తాన్ ప్రపంచ వ్యాప్తంగా ఏకాకి అవుతోంది’’ అని ముఖ్తర్ అబ్బాస్ నక్వి గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీ హ్యాకర్లు రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీకి చెందిన మరో నేత వెబ్‌సైట్‌లో కూడా పాకిస్తానీ హ్యాకర్లు చొరబడ్డారు. ‘‘కశ్మీర్ గురించి ఇంకెప్పుడూ ఆలోచించకండి. ఏ సమయంలో అయినా ప్రతీకారం తీర్చుకునేందుకు మేము సిద్ధం’’ అంటూ అందులో పోస్టు చేశారు. దీనిపై ఆ రాష్ట్ర భాజపా సమాచార సాకేంతిక విభాగాధిపతి డి. ముష్కే స్పందించారు. ‘‘వందకు పైగా వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. వాటిలో మాదీ ఒకటి. దీనిపై ఫిర్యాదు చేశాం. మాతో నేరుగా తలపడలేకే వాళ్లు ఇలాంటి చర్యలకు దిగుతున్నారు’’ అనివ్యాఖ్యానించారు.