Manda Krishna Madiga: దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసులో సరైన చర్యలు తీసుకోలేదంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కొందరు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. శనివారం కోదాడలోని పబ్లిక్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..
కర్ల రాజేశ్ మృతికి కారకులైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై మందకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యేనే కాపాడుతున్నారంటూ మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సురేశ్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్‌కి అటాచ్ చేయడంపై ధ్వజమెత్తారు. ఈ చర్య ఎస్సైని కాపాడే ప్రయత్నంలో భాగమేమని మండిపడ్డారు.ఈ కేసులో బీసీ వర్గానికి చెందిన రూరల్ సీఐ ప్రతాప్ లింగంపై సస్పెన్షన్ వేయడం అన్యాయమని అన్నారు. ఎస్సై బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టే వదిలేశారని మందకృష్ణ ఫైర్ అయ్యారు.
రాజేశ్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, లేని పక్షంలో రోడ్లపై ధర్నాలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిందితుడిపై డీఎస్పీలు, ఎస్సీలు కేసు నమోదు చేయలేదని.. వారిని వెంటనే విచారణలోకి తీసుకురావాలని డిమాండ్ చేధారు.

