ప్రభుత్వ భూములను ఆక్రమించుకోండి..
ఉద్యమకారులకు పిలుపు 250 గజాల స్థలం ఇచ్చే వరకు వదిలేది లేదు..
కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోం..
Kavitha: రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులు స్వరాష్ట్రంలో తమ ఆత్మగౌరవం కోసం మళ్లీ వీధిపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ వేదికగా వందలాది మంది ఉద్యమకారులతో కలిసి ఆమె ‘భూ పోరాటం’ ప్రారంభించారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల నివాస స్థలం ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది.
మన చెమటతోనే తెలంగాణ వచ్చింది
“మనం కడుపు మాడ్చుకుని, బతుకమ్మలు ఎత్తి, వంటా వార్పు వంటి కార్యక్రమాలతో కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కానీ రాష్ట్రం వచ్చాక కూడా మనకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం దారుణం” అని కవిత విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులు ఇప్పుడు అధికార పార్టీల్లో చేరి మనపైనే పెత్తనం చెలాయిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సచివాలయానికి వెళ్తే ఉద్యమకారులను అవమానిస్తున్నారని, అమరవీరుల కుటుంబాలను కనీసం పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు.
కమిటీల పేరుతో డ్రామాలు వద్దు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఉద్యమకారులకు ఎన్నో హామీలు ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. “మళ్లీ కమిటీలు అంటూ కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోం. ఏ ఊరిలో ఎవరు ఉద్యమం చేశారో అక్కడి ప్రజలే చెబుతారు. ఊరు వాళ్లు చెప్పిన పేర్లనే జాబితాలోకి తీసుకుని హామీలు నెరవేర్చాలి” అని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఫోరం వద్ద ఉన్న డేటా ప్రకారమే గుర్తింపు ప్రక్రియ జరగాలని సూచించారు.
విలువైన భూముల్లో మా వాటా ఎక్కడ?
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న విలువైన భూములను అమ్ముకోవాలని ప్రభుత్వం చూస్తోందని, ఆ భూముల్లో ఉద్యమకారులకు వాటా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కరీంనగర్ గడ్డ మీద మొదలైన ఏ పోరాటమైనా సక్సెస్ అవుతుందని, ఈ భూ పోరాటం కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని, హక్కులు సాధించుకునే వరకు కదిలే ప్రసక్తే లేదని కవిత హెచ్చరించారు.

