Home » Mahaboobabad: ‘మామను కొట్టి చంపిన అల్లుడు’ఘటన.. ముగ్గురి అరెస్ట్..

Mahaboobabad: ‘మామను కొట్టి చంపిన అల్లుడు’ఘటన.. ముగ్గురి అరెస్ట్..

by Post Editor
0 comments
Mahaboobabad Crime News

Mahaboobabad Crime News: మహబూబాబాద్ జిల్లాలో మామను కొట్టి చంపిన ఘటనలో అల్లుడు, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ డీఎస్పీ ఎన్. తిరుపతి రావు శనివారం వెల్లడించారు. డిసెంబర్ 11వ తేదీ రాత్రి గాంధీబాబు అతని తల్లిదండ్రులు సీతారాం, కవిత చేసిన మూకుమ్మడి దాడిలో లాలూ నాయక్ మరణించారు. ఈ ఘటనలో శనివారం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గార్ల మండలం, మర్రిగూడెం గ్రామం బోజ్యా తండాకు చెందిన బానోత్ లాలూ నాయక్ మహబూబాబాద్ పాత కలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలోని బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు శ్రీ సాయి లహరిని కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్ద తండాకు చెందిన గూగులోత్ గాంధీబాబుకు ఇచ్చి వివాహం చేశారు. వీరు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో నివాసముంటున్నారు. వివాహం జరిగినప్పటి నుంచే అదనపు కట్నం, బంగారం తేవాలంటూ గాంధీబాబు తన తల్లిదండ్రులు, చెల్లితో కలిసి శ్రీ సాయి లహరిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని పోలీసులు తెలిపారు.

ఈ వేధింపులపై బాధితురాలు లహరి మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయగా, పెద్దమనుషుల సమక్షంలో సర్దుబాటు చేసి ఆమెను తిరిగి అత్తింటికి పంపారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగడంతో పాటు కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11న రాత్రి శ్రీ సాయి లహరిపై గాంధీబాబు కుటుంబసభ్యలు మళ్లీ దాడికి యత్నించగా, ఆమె వెంటనే తండ్రి లాలూ నాయక్‌కు సమాచారం ఇచ్చిందని.. దీంతో లాలూ నాయక్ తన కుమారుడు ప్రదీప్‌తో కలిసి మిలిటరీ కాలనీలోని నిందితుల ఇంటికి వెళ్లారని పోలీసులు తెలిపారు. అక్కడ గాంధీబాబు, అతని తల్లిదండ్రులు.. ముగ్గురు కలిసి లాలూ నాయక్, ప్రదీప్‌లపై మాకుమ్మడిగా దాడి చేశారని తీవ్ర గాయాల పాలైన లాలూ నాయక్ డిసెంబర్ 12న తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై మృతుడి కుమారుడు ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ జి. మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి, 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని డీఎస్సీ తిరుపతి రావు పేర్కొన్నారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసిన టౌన్ ఇన్స్పెక్టర్, టౌన్ ఎస్సై ఎస్‌కే షకీర్‌, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

You may also like