సిద్దిపేట: రైతు రుణమాఫీతోపాటు 6 గ్యారంటీలు.. 420 హామీలను ఆగస్టు 15లోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని హైదరాబాద్ అమరవీరుల స్థూపం సాక్షిగా హరీశ్‌రావు సవాల్‌కు కాంగ్రెస్ పార్టీ వక్ర భాష్యం చెబుతున్నది. ఇందులో భాగంగా రుణమాఫీ చేశాం హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలను నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ హరే కృష్ణ సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొన్నది.
క్యాంపు ఆఫీస్‌పై దాడి..
కాగా, కాంగ్రెస్‌కు చెందిన గూండాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు. గేటును కాళ్లతో తన్నుతూ లోపలికి ప్రవేశించిన హస్తం పార్టీ కార్యకర్తలు.. ఆఫీస్‌పై ఉన్న హరీశ్‌రావు ఫ్లెక్సీని చించివేసి హంగామా చేశారు. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయం చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఫ్లెక్సీలకు పోలీసుల కాపలా..
హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారంలో భాగంగా సిద్దిపేట పట్టణంలో రుణమాఫీ పూర్తి చేసాం హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజ లారీ కృష్ణ పేరుతో పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేగింది. వాటిని తొలగించాలంటూ టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు పోలీసులు పహారా కాస్తు రక్షణ కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలకు పోలీసులు రక్షణ కల్పించడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. క్యాంపు కార్యాలయం పై అర్ధరాత్రి దాడి ప్లెక్సీలు తొలగింపు అంశంపై సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పట్టణంలో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.