Nalgonda: ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందడంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని వివిధ బ్యాంకులలో ప్రజలు, ప్రభుత్వ శాఖలు నిర్వహించని బ్యాంక్ అకౌంట్లలో సుమారు 66 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు. అందులో ప్రభుత్వ శాఖలకు సంబంధించి 20 కోట్ల రూపాయలు ఉండగా, తక్కినవి ప్రజలకు సంబంధించిన వినియోగించని, మరిచిపోయిన ఖాతాలు ఉన్నాయని అన్నారు. వాటిని సాధ్యమైనంత త్వరగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. యూరియా పంపిణీకీ సంబంధించి ఎక్కడ వివాదాలు రాకుండా మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. యూరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
అటు పత్తి కొనుగోలుకై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ ద్వారా సమస్యలు రాకుండా సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే అవసరమైన చోట రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలోనే జిల్లాకు రవాణా కమిషనర్ రానున్నారని అన్నారు ఈ సందర్భంగా జిల్లాలో చిట్యాల అండర్ పాస్, రహదారుల పై ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.
గిరిజన ప్రాంతాలైన దేవరకొండ, పెద్దవూర ప్రాంతాలలో అన్ని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలలో ఈసీఐఎల్ సహకారంతో ఏర్పాటు చేయనున్న అల్ట్రా సౌండ్ మిషన్లు, ఇటీవల దివ్యాంగులకు పంపిణీ చేసిన ట్రై సైకిల్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కాగా ఈ సోమవారం మొత్తం 97 ఫిర్యాదులు రాగా, జిల్లా అధికారులకు 46, రెవెన్యూ శాఖకు సంబంధించి 51 ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, గృహ నిర్మాణం పీడీ రాజ్ కుమార్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

