Kalvakuntla Kavitha: దేవుడి దయతో సీఎం అవుతానని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను వెలికితీస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కుట్రపన్ని పార్టీ నుంచి వెళ్లగొట్టారని, అయినా కళ్లు చల్లబడలేదా అని బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు.
తనను విమర్శించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చాలా చిన్నవారని, వారి వెనుక ఒక గుంట నక్క ఉందని అన్నారు. కృష్ణారావు బాధితులు తనకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు నోటీసులు పంపిస్తున్నాని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పని కూడా అడగలేదని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్‌కే పరిమితమయ్యానని స్పష్టం చేశారు. వారంలోగా కృష్ణారావు క్షమాపణ చెప్పకపోతే కోర్టులో తేల్చుకుంటామని అన్నారు.

